ఒక్క ఓటుతో మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలి : సీపీఐ  నారాయణ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఒక్క ఓటుతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు బుధవారం నామినేషన్​ వేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్​యార్డు​ నుంచి కొత్తగూడెంలోని ఆర్డీఓ ఆఫీస్​వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బీఆర్​ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్క తాను ముక్కలేనని, వాళ్లను ఉమ్మడిగా ఓడించే అవకాశం వచ్చిందన్నారు.

మోదీ, కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొత్తగూడెం ఒక్క సీటే తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బీఆర్​ఎస్ క్యాండిడేట్లను అసెంబ్లీ గేటు దాటనీయమని కాంగ్రెస్​ నేతలు అంటున్నారని, ఫామ్​హౌస్ ​కూడా దాటనీయకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. లిక్కర్ స్కామ్​లో కేంద్రం కవితను, వైసీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కేసీఆర్​ నియంత పాలన సాగుతుంటే కొత్తగూడెంలో కీచకుల పాలన నడుస్తున్నదన్నారు. బీఆర్​ఎస్​ పాలనతో దగా పడ్డ తెలంగాణ ప్రజల పక్షాన కమ్యూనిస్టులు పోరాడుతున్నారన్నారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్, సీపీఎం, టీజేఎస్, ప్రజాపంథా, న్యూడెమోక్రసీల మద్దతులో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

వనమా పీడ వదలాలి : కూనంనేని

 కాపురాలను కూల్చి, సజీవ దహనాలకు పాల్పడే పాలకులు కొత్తగూడానికి  అవసరం లేదని సీపీఐ స్టేట్​ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆడవాళ్లను చెరబట్టే కీచకులకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్​ఎస్​ గెలిస్తే ఆడవాళ్లు  బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకు వనమా రాఘవ పీడ వదిలించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్​ రాష్ట్ర నేతలు సాబీర్​పాషా, దయానంద్, బాగం హిమవంతరావు, రామనాధం, బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, కె. సారయ్య పాల్గొన్నారు.