సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండని సొంత పార్టీ నేతలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పువ్వాడ నాగేశ్వరరావు అయినా సరే పొత్తు ధర్మం పాటించకపోతే ఆయన్ను కూడా సస్పెండ్ చేస్తామని చెప్పారు.
మామిడి చెట్టుకు మామిడి కాయలు కాయాలి గానీ.. ఇక్కడ మాత్రం గంజాయి కాసిందని విమర్శించారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నారాయణ వ్యాఖ్యలతో సీపీఐ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ లో పువ్వాడ అజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ నాయకులు పువ్వాడ అజయ్ తో కలిసి అంతర్గత సమావేశాలకు హజరవుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. పువ్వాడ నాగేశ్వరరావు తమ కుమారుడు అజయ్ నిర్వహించే ఆత్మీయ సమావేశాలకు సీపీఐ నాయకులుగా ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దిద్దుబాటు చర్యలు లేకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.