బీఆర్ఎస్​, బీజేపీని ప్రజలు నమ్మడం లేదు : చాడ వెంకట్​రెడ్డి

మంచిర్యాల, వెలుగు: దేశంలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి అన్నారు. శనివారం మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్​ హాల్​లో నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లడుతూ.. మునుగోడు బై ఎలక్షన్​లో వామపక్షాల మద్దతుతో గెలిచిన కేసీఆర్​ఆ తర్వాత పొత్తులంటూ హడావుడిగా అభ్యర్థులను ప్రకటించి తమను మోసం చేశారన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లను సీపీఐకి ఇచ్చే విధంగా కాంగ్రెస్​తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్​, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు పాల్గొన్నారు.