అసెంబ్లీలో దోస్తీ.. సింగరేణిలో కుస్తీ

అసెంబ్లీలో దోస్తీ.. సింగరేణిలో కుస్తీ
  • గుర్తింపు’ సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ అనుబంధ యూనియన్లు
  • ఒంటరి పోరుతో లాభమెవరికో!

గోదావరిఖని, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ.. తాజాగా జరుగుతున్న సింగరేణి ‘గుర్తింపు’  సంఘం ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలకు చెందిన ట్రేడ్‌‌‌‌‌‌‌‌ యూనియన్లు వేర్వేరుగా బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఒంటరి పోరుతో ఎవరికి ఈ ఎన్నికల్లో లాభం జరుగుతుందనే  చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  పార్టీకి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

సీపీఐ నుంచి కొత్తగూడెం అసెంబ్లీకి ఆ పార్టీ నేత కూనంనేని సాంబశివరావు పోటీ చేయగా, అక్కడ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  పార్టీ నేతలు మద్దతు ఇచ్చి ఆయనను గెలిపించారు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  అభ్యర్థులు గడ్డం వినోద్‌‌‌‌ (బెల్లంపల్లి), వివేక్‌‌‌‌‌‌‌‌  వెంకటస్వామి (చెన్నూరు‌‌‌‌), ప్రేమ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌ ‌‌‌‌రావు (మంచిర్యాల), శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు (మంథని), ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌ (రామగుండం)‌‌‌‌, గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), కోరం కనకయ్య (ఇల్లందు), మట్టా రాగమయి (సత్తుపల్లి) గెలిచారు.

ఆ అభ్యర్థులకు సీపీఐ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. గనులపై గేట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, పట్టణాల్లో బైక్ ‌‌‌‌ ర్యాలీలు నిర్వహించింది. ఎన్నికలయ్యే వరకు ఈ రెండు పార్టీలు కలిసి ప్రచారం చేశాయి. సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీల యూనియన్లు వేర్వేరుగా బరిలో నిలిచి ఒంటరి పోరు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతు ఏ యూనియన్‌‌‌‌‌‌‌‌కు ఉంటుందోననే ప్రచారం కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌లో జోరుగా సాగుతున్నది.

గత ఎన్నికల్లో ఏఐటీయూసీకి ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ మద్దతు

సింగరేణిలో ఆరోసారి 2017 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ యూనియన్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అనుబంధ ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ యూనియన్‌‌‌‌‌‌‌‌  మద్దతు తెలిపింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌‌‌‌) ను  ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ నాడు నిర్ణయం తీసుకోవడంతో ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. దీంతో సింగరేణి ఏరియాల్లో ఉన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  ప్రజాప్రతినిధులు ఏఐటీయూసీ తరపున ‘గుర్తింపు’ ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ వేర్వేరుగా పోటీలో నిలిచాయి. 

మూడుసార్లు ఏఐటీయూసీ.. ఒకసారి ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ గెలుపు

సింగరేణిలో 1998 నుంచి 2017 వరకు ఆరుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించగా, అందులో మూడుసార్లు సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, ఒకసారి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  అనుబంధ ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ గెలుపొందాయి. 1998, 2001, 2007లో ఏఐటీయూసీ, 2003లో ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ సింగరేణి గుర్తింపు సంఘంగా వ్యవహరించాయి. రెండుసార్లు టీబీజీకేఎస్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు సంఘమైంది. తాజాగా ఈనెల 27న సింగరేణిలో ఏడోసారి జరగనున్న గుర్తింపు పోరులో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ రెండు యూనియన్లకు చెందిన సింగరేణి లీడర్లే గనులపై గేట్‌‌‌‌‌‌‌‌  మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెడుతూ కార్మికులను కలుస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే రెండు యూనియన్లకు చెందిన అగ్ర నాయకులు ఇంకా ప్రచార పర్వంలోకి దిగలేదు.