జర్మనీలో జన్మించిన కార్ల్ మార్క్స్ ఉన్నత చదువులు అభ్యసించి సామాజిక స్పృహతో యజమాని-బానిస సంబంధాలను అధ్యయనం చేశాడు. ప్రకృతి అందించే సహజ వనరులు అందరివైనప్పటికీ యజమాని– బానిస మధ్య వ్యత్యాసం కొనసాగుతున్నదని గుర్తించాడు. యజమాని సంపద పెరుగుతోంది. కానీ, బానిస శ్రమ దోపిడీకి గురి అవుతూ శారీరకంగా కృశిస్తున్నాడు. బానిసకు శ్రమకు తగిన ఫలితం రావడం లేదు.
ఆదిమ మానవ సమాజంలో పెద్దగా అంతరాలు లేవు. కానీ, రానురాను ఆర్థికంగా అంతరాలు పెరిగాయి. ఈనేపథ్యంలో పారిశ్రామిక కార్మికవర్గం దిశగా అడుగులు పడ్డాయి. అప్పుడే శ్రమదోపిడీకి గురి అయ్యేవారంతా ఒక్కటి కావాలని పిలుపిచ్చారు. మరో అడుగు ముందుకేసి తన స్నేహితుడైన ఏంగెల్స్ సహాయంతో మార్క్స్ అధ్యయనాన్ని మరింత విస్తృతపరిచి 1847లో కమ్యూనిస్టు ప్రణాళికను విడుదల చేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా శ్రమదోపిడీకి గురి అయ్యేవారందరికి దివిటీ అయింది.
కమ్యూనిస్టు పార్టీని రష్యాలో వి. ఐ. లెనిన్ స్థాపించి.. జార్ చక్రవర్తులను ఓడించి 1917లో రష్యాలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మార్క్స్ సిద్ధాంతాన్ని రాయగా, లెనిన్ ఆచరించినందున మార్క్సిజం- లెనినిజంగా నేడు పిలువబడుతోంది. ఆ వెలుతురులో అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం పునాదుల మీద ఏర్పడ్డాయి.
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామం
ప్రపంచంలో గతంలో చైనా తర్వాత అధిక జనాభా కలిగిన పెద్దదేశం భారతదేశం. ఇక్కడ 550 సంస్థానాలకుపైగా ఉండగా వాటి పాలన బ్రిటిష్‌వారి పెత్తనం కింద కొనసాగింది. అనేక సంస్థానాలలో అక్కడి అణచివేతలపై తిరుగుబాట్లు జరిగాయి. పరిశ్రమలు ఏర్పడిన పిదప కార్మికులు సంఘాలు పెట్టుకున్నారు. 1920లో ఏఐటీయూసీ స్థాపించబడింది. అప్పటికి దేశానికి స్వాతంత్య్రం రాలేదు. కానీ, 1857 సిపాయిల తిరుగుబాటు స్వాతంత్య్ర సంగ్రామానికి అడుగులు పడ్డాయి.
స్వాతంత్య్ర సాధనకు కాంగ్రెస్ స్థాపించబడింది. అది పార్టీ కాదు. భారతీయులలో నెలకొన్న అసమ్మతి, అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఏఓ హ్యూమ్ ఆధ్వర్యంలో ఒక వేదికగా రూపొందించబడింది. అప్పటికే కామ్రేడ్స్ కమిటీ, అభ్యుదయ భావాలకు చెందినవారు చిన్నచిన్న సంఘాలుగా ఏర్పడ్డారు. 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులోని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపించబడింది.
అది మార్క్సిజం లెనినిజం సిద్ధాంత పునాదులపైన స్థాపించబడినందున అంతరాలు లేని వర్గరహిత సమాజ లక్ష్యంగా, ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదట పిలుపిచ్చింది సీపీఐ మాత్రమే. సీపీఐ పట్టిన పట్టువిడవకుండా నిరంతర ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడింది.
ప్రత్యక్ష పోరాటాలు
అనేక సంస్థానాలలో నెలకొన్న దుర్మార్గాలను, అణచివేతలను, వెట్టిచాకిరిని ఎండగడుతూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఏర్పడగానే ఆనాటి ముఖ్య నాయకులందరిని బ్రిటిష్ ప్రభుత్వం కాన్పూరు, మీరట్, పెషావర్ కుట్ర కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైల్లో నుంచి విడుదలవకుండా నిర్బంధాలకు గురిచేసింది. ఒక్కొక్క నాయకుడు 9 సంవత్సరాల పైబడి జైల్లో మగ్గారు. సీపీఐ ఆరంభంలో అనేక ఆటుపోట్లకు గురి అయ్యింది. అనేక సంస్థానాలలో నెలకొన్న రాచరిక వ్యవస్థ అణచివేతలను ఖండిస్తూ ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవడం కత్తి మీద సాములాగానే కొనసాగింది.
దేశవ్యాప్తంగా అనేక సంస్థానాలలో తిరుగుబాట్లు జరిగాయి. బ్రిటిష్ వారికి సంస్థానాదీశులు కప్పం చెల్లించేవారు. కాబట్టి, అవసరమైన మిలటరీ అండదండలు అందించారు. ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో ప్రఖ్యాతిగాంచింది. అనేకచోట్ల కార్మికులు, కూలీలు, రైతులు స్వేచ్ఛ, హక్కుల సాధన కోసం విజృంభించారు. ప్రాణాలకు తెగించి పోరాటాలు చేశారు.
తెలంగాణలో భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం ఊహించజాలం. అనేక ఘటనలు, ఉదంతాలు బాహ్యప్రపంచానికి తెలియని అనేక సన్నివేశాలు సాయుధ పోరాటంలో చోటు చేసుకున్నాయి. ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలి. వెట్టిచాకిరి రద్దు, అయ్య నీ బాంచెన్ (బానిసను) అనే దురాగతాలు సీపీఐ త్యాగాల వల్లనే మారాయి. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ త్యాగాలకు నిలయమైనది. లాఠీ, తూటాలు జైళ్లలో ఎక్కువ కాలం, ఎక్కువ మంది శిక్షను అనుభవించింది కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాత్రమే. అనేక సంస్థలు, పార్టీలు, తెగింపు ఉద్యమాలు చేసినందునే బ్రిటిషువారు దేశాన్ని వదలిపెట్టి వెళ్లిపోయారు.
1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణ నాయకులందరూ జైళ్లలో ఉండటంతో కొంతమంది జైళ్లలో నుంచి నామినేషన్ వేశారు. తెలంగాణ సంస్థానంలో 16 జిల్లాలుండేవి. 8 తెలంగాణ, 5 కర్నాటక, 8 మహారాష్ట్రలో ఉండేవి. అప్పుడు తెలంగాణలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మిగతా రెండు ప్రాంతాలలో తక్కువ మంది గెలిచినందువలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికలలో చాలాచోట్ల పార్టీ గెలిచింది. అప్పటి త్యాగాలు, పోరాటాలు ప్రజల హృదయాలలో స్థానం పొందాయి.
రాజ్యాంగం అమలు తీరు
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిన తరువాత ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు సాగాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదా ఆమోదించబడింది. అందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రధానపాత్ర పోషించారు. నేటి పాలకులు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతుండటం దారుణం. గతంలో తొలి ప్రభుత్వంలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడం లాంటి దుర్మార్గాలకు ఒడిగట్టారు. ఆ విధంగా ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా కేరళలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరింత విచ్చలవిడిగా రాజ్యాంగ సవరణలకు పూనుకోవడం దుర్మార్గం. ఈ మధ్య జమ్ము కాశ్మీర్ రక్షణ కవచంగా ఉన్న 370 ఆర్టికల్ కూడా రద్దు చేశారు.
అనేక విజయాలు
దున్నేవాడికే భూమి అనే నినాదం ఉధృతరూపం దాల్చడంతో పాలకులకు భూచట్టాలు తేకతప్పలేదు. 1970 తర్వాత దేశవ్యాప్తంగా భూపోరాటాలు ఉధృతంగా జరిగాయి. అక్రమ నిల్వలకు వ్యతిరేకంగా గోదాంలపై దాడులు చేయబడ్డాయి. ప్రజల మాన, ప్రాణాల రక్షణ కోసం సీపీఐ ప్రజల రక్షణ కవచమైంది. స్వాతంత్ర్యం సిద్ధించిన పిదప కూడా రాజులకు రాజభరణాలు చెల్లించేవారు.
సీపీఐ ఒకవైపు భూ పంపిణీకి భూసంస్కరణల చట్టాలు కావాలని భూ ఆక్రమణల పోరాటాలకు శ్రీకారం చుట్టింది. జైళ్లపాలైనప్పటికి వెనుకడుగు వేయకుండా పోరాడింది. ఈరోజు భూ చట్టాలు వచ్చాయంటే సీపీఐ పోరాటాలవల్లనే అనేది నగ్నసత్యం. రాజభరణాల రద్దుకు ప్రభుత్వాన్ని ఉక్మిరిబిక్కిరి చేయడంతో కేంద్ర ప్రభుత్వం రాజభరణాల రద్దుకు చట్టం చేసింది. పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న బ్యాంకులను జాతీయం చేయాలనే ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో బ్యాంకులను జాతీయం చేయడమైంది. పెట్టుబడిదారులకు అప్పులివ్వడం కాదు. నిరుపేదలకు, ఎస్సీ, బీసీ, బడుగు బలహీనవర్గాలకు అప్పులిచ్చే నిబంధనలు రూపొందించబడినాయి.
1975 తర్వాత నుంచి సంక్షేమ పథకాల అమలుప్రక్రియ ప్రారంభించబడింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లు అమలులోకి వచ్చాయి. ఈ మధ్య అవి కూడా నేరుగా అమలుకావడం లేదు. ఏఐటీయుసీ, ఏఐకేఎస్, బీకేఎంయు, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, ఐపీటీఎలాంటి అనేక సంఘాలను మొట్టమొదట స్థాపించింది సీపీఐ. ఆ తర్వాతనే అన్ని పార్టీలు ప్రజాసంఘాలను స్థాపించాయి. రాజకీయ వనరులు, సామాజిక స్పృహకు ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించబడటానికి సీపీఐ విశేష కృషి చేసింది. అనేక ఆటుపోట్లు, కష్టాల కడగండ్లు, అణచివేతలు, నిర్బంధాలతో పాలక ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు కల్పించి, అణచివేసినా ఇప్పటికీ అధికారం రాకపోయినా నిరాశ నిస్పృహలకు గురికాకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్మించబడడానికి నిరంతరం ఉద్యమిస్తున్నది సీపీఐ.
2014లో అధికారం చేపట్టిన మోదీ తీరు గర్హనీయం కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాజ్యాంగ సవరణల పేరుతో ఉల్లంఘనలకు పాల్పడుతూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నది. నల్లడబ్బు వెలికి తీస్తానన్న హామీ నీటిబుగ్గలానే ఉ౦డిపోయింది. ఒకే పన్ను ఒకే దేశమని ప్రగల్భాలు పలికి జీఎస్టీని తెచ్చి పరోక్షంగానే కేంద్ర సుంకాలు, అనేక పేర్లతో ట్యాక్స్‌లు సేకరిస్తున్నది.
రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఇప్పుడేమో ఒకే దేశం ఒకే ఎన్నిక అని జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణకు పూనుకుంటున్నది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం పార్టీ యావత్ నాయకత్వానికి గర్వకారణం. వందలాది పార్టీలు పుట్టుకొచ్చి మాయమైనట్లు కాకుండా మార్క్సిజం-లెనినిజం సిద్ధాంత పునాదుల మీద ఆటుపోట్లను ఎదుర్కొంటూ విజయాలు సాధిస్తున్నది సీపీఐ అనేది నగ్నసత్యం. ఈనాటి అవకాశవాద, కార్పొరేట్, నేరపూరిత రాజకీయాలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికకావడం ఎంత ఇబ్బందితో కూడుకున్నదో ఊహించజాలం. ఎవరు అధికారంలో ఉన్నా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రజల సంక్షేమం పట్ల ఏ పార్టీ శ్రద్ధ కనబరుస్తున్నదనేది ముఖ్యం. అదే గమ్యం, గమనానికి గీటురాయి.
కర్తవ్యం
అనేక సంవత్సరాలుగా పార్టీ పట్ల విశ్వసనీయతతో నాయకత్వస్థానంలో, కార్యకర్తలుగా, సానుభూతిపరులుగా చాలామంది ఉన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా లక్షలాది ప్రజానీకం ఉన్నది. పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి తనదైనశైలిలో ఉద్యమాలు పోరాటాలు నిర్మిస్తున్నది. అయితే, ప్రజాప్రాతినిధ్యం తగ్గిందనే ఒక నెపాన్ని.. ఇతర బూర్జువా పార్టీలు, వర్గశత్రువులు నెడుతున్నారు.
అయితే, అసలు విషయాన్ని సమాజం గుర్తించాలి. సీపీఐ దేశంలోనే రాజకీయ ఓనమాలకు శ్రీకారం చుట్టింది.100 సంవత్సరాలు గడిచినా ప్రజల చేత, ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించే పార్టీగా అంతిమ లక్ష్యంగా, మరింత అంకితభావం విలువ లకు కట్టుబడి ఉండటమే లక్ష్యంగా పార్టీ పునరంకితం కావాలి. వర్గరహిత, సమసమాజ సాధనకు పునరంకితం కావడం పార్టీ సభ్యుల సానుభూతి పరుల లక్ష్యం కావాలి.
కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలంటే ఇదేదో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకే పరిమితం కాదు. భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పడి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధులను దేశానికి అందించిన పార్టీ ఇది. ఇది స్వాతంత్ర్యోద్యమం నుంచి స్వాతంత్ర్యం అనంతరం అనేక దేశ చరిత్రతో, చారిత్రక సంఘటనలతో కమ్యూనిస్టు పార్టీ చరిత్ర పెనవేసుకొని ఉన్నది.
భూ సంస్కరణల చట్టాలు, పేదలకు భూమి పంపిణీ చేయడం, సమాచార హక్కు, అటవీ హక్కుల చట్టం, భూ సేకరణ చట్టం, గ్రామీణ ఉపాధిహామీ హక్కు చట్టం, ఇలా ప్రతి ప్రగతిశీల చట్టాలు, పథకాలు కేవలం ప్రభుత్వాలు మనసులోంచి వచ్చిన ఆలోచనలు కాదు. అవి వాస్తవ రూపం తీసుకునేందుకు కమ్యూనిస్టు పోరాటాలు భూమిక అనేది వాస్తవం. కమ్యూనిస్టు పార్టీ దేశంలో అధికారంలోకి రానప్పటికీ, గణనీయమైన ప్రభావం నిస్సందేహంగా చూపుతున్నది . వామపక్షాల మద్దతుతో ఏర్పడిన నేషనల్ ప్రంట్, యునైటెడ్ ప్రంట్, యూపీఏ -1 ప్రభుత్వాలు ప్రజానుకూల చట్టాలు, పథకాలు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం.
-చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు-