- సీపీఐ నాయకుల ధర్నా
భీమదేవరపల్లి, వెలుగు: ఎల్కతుర్తి- సిద్దిపేట హైవే నిర్మాణ కాంట్రాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల సీపీఐ నాయకులతో కలిసి కొత్తపల్లి గ్రామం వద్ద జరుగుతున్న హైవే నిర్మాణ పనులను పరీశీలించారు. ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎల్కతుర్తి - సిద్దిపేట హైవే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం కంకర, ఇతర సామగ్రి వినియోగిస్తూ నాణ్యతను పాటించడం లేదని ఆరోపించారు. దీంతో రోడ్డు నిర్మాణం పూర్తి కాకముందే ధ్వంసం అవుతోందన్నారు. కాంట్రాక్టు పనులు దక్కించుకుని నెలలు గడుస్తున్నా సకాలంలో పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.