- వారిని నిండా ముంచిన కేసీఆర్ ఫాంహౌజ్ లో పడుకుండు
- సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా బాధితులకు అండగా నిలవాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
గజ్వేల్, వెలుగు: మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఎవరిని కదిలించినా కంట కన్నీరు ఉబికివస్తుందని, వారి బాధలు వర్ణనాతీతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయి అనాథలుగా మారిన బాధితుల త్యాగాలు కొందరికి భోగాలయ్యాయని విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ టౌన్ శివారులోని ఆర్అండ్ఆర్ కాలనీలోని ముంపు గ్రామాలను సందర్శించి, బాధితులతో మాట్లాడారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు బాధితులకు సీపీఐ అండగా ఉండి పోరాటం చేస్తుందని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీలో చర్చించి తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. కాళేశ్వరం నిర్మాణం పేరుతో అన్నిరకాలుగా ఆదుకుంటామని గొప్పగా చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం ముఖం చాటేయడం తగదన్నారు. నమ్మి గెలిపించిన గజ్వేల్ ప్రజల కోసం ముసుగు తీయక తప్పదన్నారు.
భూసేకరణ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కేసీఆర్ కట్టుబడి ఉండాలన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోక ముందే కేసీఆర్ఫాంహౌజ్ నుంచి బయటకు రావాలని హితవు పలికారు. నిర్వాసితులను సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఆదుకునేలా దృష్టి పెట్టి ప్రతి ఊరికి ఒక పాఠశాల, స్మశాన వాటిక, తాగునీటి వసతులు, అర్హులకు ప్యాకేజీ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. గజ్వేల్ సీపీఐ ఇన్ చార్జి శివలింగు కృష్ణ అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి మంద పవన్, మాజీ కార్యదర్శి దయానంద రెడ్డి, నేతలు తదితరులు పాల్గొన్నారు.