రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు పర్మిషన్ ఇవ్వొద్దు

రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు పర్మిషన్ ఇవ్వొద్దు
  • సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేయాలి: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు కోరారు. మంగళవారం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కూనంనేని పరామర్శించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం సంపాదనే లక్ష్యంగా సినిమాలు రూపొందిస్తున్నారని మండిపడ్డారు. ఓ సినీ నటుడు ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర పోషిస్తే సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్​ఇస్తుందని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు బడా నిర్మాతలు, హీరోల చేతుల్లో బందీగా మారిందని.. దానిని ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేస్తే.. కొందరు నాయకులు రాజకీయ చేయడం సరికాదన్నారు.

ఘనంగా శతాబ్ది ఉత్సవాలు 

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను రేపటి నుంచి 2025 డిసెంబర్ 26 వరకు ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించనున్నట్టు కూనంనేని తెలిపారు. 26న కాన్పూర్​లో ప్రారంభమవుతాయని, వచ్చే సంవత్సరం డిసెంబర్​లో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభతో ఉత్సవాలు  ముగుస్తాయన్నారు. 

ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోసం అధికార పార్టీతో సీపీఐ పొత్తుపెట్టుకుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై కూనంనేని స్పందించారు. ఓట్లు, సీట్లు అనేది కమ్యూనిస్టు పార్టీకి ముఖ్యం కాదని, పేద ప్రజలకు న్యాయం చేయడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు.