ప్రగతిశీల రాజకీయాలకు సీఎం కేసీఆర్ కంకణబద్దుడై ఉన్నారని, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తోందన్నారు. మునుగోడులో నిర్వహించే కేసీఆర్ సభకు తమ పార్టీ తరపున పల్లా వెంకట్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా తెరపైకి వచ్చిందని, తన స్వార్థ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా బీజేపీని ఓడించేందుకు బలమున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
రాజకీయాలు వేరు, ఎన్నికల ఎత్తుగడలు వేరు
ఇప్పుడు పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ర్ట విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ కి చాలా బలహీనతలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ పార్టీ గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ కూడా అన్ని హామీలను నెరవేర్చలేదని, కానీ, నెరవేరుస్తారని తాము ఆశిస్తున్నామని చెప్పారు. రాష్ర్టంలోని ప్రజా సమస్యల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజకీయాలు వేరు, ఎన్నికల ఎత్తుగడలు వేరని చెప్పారు.
శత్రు శిబిరంలో రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి మా మిత్రుడే.. కానీ, ప్రస్తుతం శత్రు శిబిరంలో ఉన్నారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోస్తోందని ఆరోపించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు మారుతుంటాయని అన్నారు.