సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి
చిగురుమామిడి, వెలుగు : దళితబంధు పథకాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని, మిగితా దళితులు అర్హులు కాదా.. వారికి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. దీనిపై పార్టీ శ్రేణులు ప్రశ్నించాలని, దళితులందరికీ పథకం వచ్చేలా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ 18వ మండల మహాసభ మంగళవారం కరీంనగర్జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ముస్కు రాజురెడ్డి భవన్లో అందె చిన్న స్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
2022 విద్యుత్ సంస్కరణల చట్టం రానుందని, ఈ చట్టంతో విద్యుత్ పై రాష్ట్రాలకు అధికారం లేకుండా పోతుందన్నారు. రైతులకు, వినియోగదారులకు తీవ్ర కష్టాలు తప్పవని, అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.