బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్​కు లేదు : కూనంనేని సాంబశివరావు

బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్​కు లేదు
కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదు : కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని ప్రకటన
ఆ సీటుపై క్లారిటీ వచ్చాకే బీఆర్ఎస్​తో పొత్తు అని వెల్లడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్​కు లేదని సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనం నేని సాంబశివరావు అన్నారు. కొత్త గూడెం క్లబ్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బీజేపీపై చేసే ఫైట్ చాలదన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ స్థాయిలో ప్రతిపక్షాలన్ని ఒక్కటి అవుతున్నాయని, బీజేపీని ఓడించాలంటే అందరిని కలుపుకొని పోవాల్సి ఉం దన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చలేదన్నారు. విభజన హామీలపై కేసీఆర్ ఎలాంటి పోరాటం చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. భద్రాచలం నుంచి విడదీసి ఏపీలో కలిపిన ఐదు గ్రామాల విషయంలో పోరాటం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 11లక్షల ఎకరాలకు పోడు పట్టాలివ్వాల్సి ఉన్నా కేవలం 3లక్షల ఎకరాలతో సర్కార్ సరిపెట్టాలని చూస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా ఫెయిల్ అయిందని విమ ర్శించారు. రుణమాఫీ ఇంకెన్నాళ్లు సాగదీస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ ​సర్కార్ ​ప్రభుత్వం, సింగరేణి ఆర్థిక స్థితిపై యాజమాన్యం వైట్​పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్​కు కొనసాగే అర్హత లేదన్నారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసరే ఇంత కాలం సీఎండీగా ఎందుకుండాలె అని ప్రశ్నించారు. 

సీపీఎంతో పొత్తు

సీపీఎంతో తమకు పొత్తులపై స్పష్టత ఉందని కూనం నేని అన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్​కు సపోర్ట్​గా నిలిచామని తెలిపారు. కొత్తగూడెం సీటుపై స్పష్టత లేకుండా పొత్తులుండవన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. పొత్తుల ఆధారంగా సర్దుబాటు ఉంటుందన్నారు. అలయెన్స్​ కుదరని పక్షంలో రాష్ట్ర స్థాయిలో కొత్తగూడెంతో పాటు హుస్నాబాద్​, బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ స్థానాల్లో పోటీ చేసేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వచ్చే నెల 4వ తేదీన కొత్తగూడెంలో దాదాపు లక్షమందితో ప్రజా గర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.