హనుమకొండలోని కాళోజీ జంక్షన్ వద్ద ఉద్రిక్తత

హనుమకొండలోని కాళోజీ జంక్షన్ వద్ద ఉద్రిక్తత

హనుమకొండ జిల్లా : హనుమకొండలోని కాళోజీ జంక్షన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఏకశిలా పార్క్ నుండి వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి గుడిసె వాసులతో కలిసి సీపీఐ నేతలు బయలుదేరి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సీపీఐ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీపీఐ నాయకులు రోడ్డుపైనే బైఠాయించి..నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావుతో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. 

ఇళ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు ఇవ్వాలె

ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు ఇవ్వడం లేదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన తర్వాత సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నిరుపేదల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందన్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్స్ ఎన్ని కట్టించారు..? ఎంతమంది అర్హులు ఉన్నారో తెలుసా..? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ కట్టుకునే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న రూ.3లక్షలు సరిపోవని, మొత్తం రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షలు కాదు.. ముందు ఇంటి స్థలం  ఇవ్వండి’ అని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 

రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ తరహాలో పోరాటం చేయాలె

ప్రభుత్వ భూముల లెక్కలు తీసి, వాటిని పేదలకు కేటాయించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నిరుపేదలకు భూమి పట్టాలు ఇస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. తమకు పోలీసుల మైక్ పర్మిషన్ ఇవ్వలేదని, సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నిస్తే ఆపగలరా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ తరహాలో ఓరుగల్లు మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసి.. హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.