ఖమ్మం: రాష్ట్రంలో ఎర్ర జెండా పార్టీలను ఏకం చేసేందుకు కృషి చేస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివ రావు అన్నారు. పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మొదటిసారి సొంత జిల్లా ఖమ్మంకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఖిల్లా అని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలు ఖమ్మం నుంచే పురుడుపోసుకున్నాయని చెప్పారు. ఖమ్మం అంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు మారుపేరని, ఇవాళ తాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం కార్యకర్తల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు.
ఖమ్మం రూరల్ సీఐ తమ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, యూనిఫాంలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని కూనంనేని సాంబశివ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా సీఐ తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.