స్థానిక ఎన్నికల్లో సొంతంగా పోటీ : కూనంనేని సాంబశివరావు

స్థానిక ఎన్నికల్లో సొంతంగా పోటీ : కూనంనేని సాంబశివరావు
  • కాంగ్రెస్​తో పొత్తులు శాశ్వతం కాదు: కూనంనేని సాంబశివరావు

వనపర్తి, వెలుగు: కాంగ్రెస్​తో  పొత్తులు శాశ్వతం కాదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులు సొంతంగా పోటీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీలను అభిమానించేవారు, కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఆదివారం వనపర్తి లో జరిగిన సీపీఐ శతజయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కూనంనేని మాట్లాడుతూ..  సూర్యుడు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ సజీవంగా ఉంటుందని తెలిపారు. 

కొందరు కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని అంటున్నారని, ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీకి అంతం లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో అధికారం లేకపోయినా సీపీఐ వందేండ్లుగా సజీవంగా ఉందన్న విషయం వారు తెలుసుకోవాలని సూచించారు. దేశంలో జనతా పార్టీ, లోక్ దళ్, స్వతంత్ర పార్టీ అధికారంలో కొంతకాలం ఉన్నాయని, అధికారం పోగానే కనుమరుగయ్యాయన్నారు. 

రాష్ట్రాన్ని బీఆర్ఎస్​దోచుకున్నది

కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలు కమ్యూనిస్టు పార్టీని వాడుకొని మోసం చేశాయని, మోసపోవడం కమ్యూనిస్టు పార్టీల వంతైందని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.  బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్​పై విమర్శల దాడి చేయడం  సిగ్గుచేటన్నారు.