హైదరాబాద్, వెలుగు:వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ముగ్దూం భవన్, రాజ్బహదూర్గౌర్హాల్లో మంగళవారం చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి కూనంనేనితోపాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని, హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటి తరాలకు తెలియజేయాలని కోరారు.
హైదరాబాద్ సంస్థానంలోని పేదలు, బడుగుబలహీన వర్గాలపై..నిజాం ప్రభువుకు చెందిన రజాకార్లు, దొరలు, జాగీర్దార్లు దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి గోసపెట్టారని తెలిపారు. విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలు, దౌర్జన్యాలను ఎదురించిన వీరనారి ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందని కూనంనేని గుర్తు చేశారు.