పేదలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఎగురుతూనే ఉంటది : కూనంనేని సాంబశివరావు

భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వమే పురుడుపోసుకొని ఇప్పటికీ కొనసాగుతున్న అతి కొద్ది రాజకీయ పార్టీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ప్రముఖమైనది. సీపీఐ1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్​లో పుట్టి 97 ఏండ్లు పూర్తి చేసుకొని 98వ ఏట అడుగిడుతున్నది. ఈ సందర్భంగా పార్టీ స్థాపించిన నాడు దేశంలో  పరిస్థితులను ఒక సారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీపీఐ ఆవిర్భావానికి ముందే అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిజం, -లెనినిజం సిద్ధాంత పునాదులు ఏర్పడ్డాయి. 1917లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టో వెలుగులో లెనిన్ నేతృత్వంలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యాలో ఏర్పడింది. మన దేశంపైన కూడా ఆ ప్రభావం పడటంతో మరికొంత మంది మేధావులు సిద్ధాంత అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూనే సహచరులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. భారతదేశంలో 1920-– 22 మధ్య గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణోద్యమం ఉవ్వెత్తున ఎగసింది. అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా, చైతన్యవంతులై ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆకస్మాత్తుగా ఈ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడంతో యువకులు తీవ్ర నిరుత్సాహానికి లోనై, బ్రిటీష్​పాలనకు వ్యతిరేకంగా మరింత శక్తివంతమైన విప్లవోద్యమం కోసం అన్వేషించారు. ఆ నేపథ్యంలో కార్మికుల సమీకరణకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసి)1920లో స్థాపితమైంది.1925లో సామ్రాజ్యవాదానికి, వలస పాలన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా స్థిరమైన పోరాటం చేయాలని లక్ష్యంతో ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో విప్లవ యువ కిశోరాలతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. భారత దేశ స్వాతంత్ర్యోద్యమం, ఆ తర్వాత స్వతంత్ర భారతావనిలో ఇదొక చారిత్రాత్మక కీలక మలుపు. తెలుగునేలపై ఒక విప్లవ వేదిక కోసం ఎదురు చూస్తూ, అప్పటి వరకు కాంగ్రెస్ ద్వారా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, ఎల్లారెడ్డి వంటి వారు కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చేశారు. కాంగ్రెస్​లో ప్రత్యేక గ్రూపుగా ఉన్న కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకులు కూడా ఈ స్రవంతిలో చేరారు.

నిజాం సంస్థానంలో పోరాటం

బ్రిటీషు పాలకులు కమ్యూనిస్టులపై నిషేధాలు, నిర్భందాలు విధించారు. మీరట్, కాన్పూర్ కుట్రకేసులు పెట్టి కమ్యూనిస్టు నాయకులను చిత్రహింసలకు గురిచేశారు. వీటికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటై పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించింది.నెహ్రూ స్వయంగా ఈ కేసులో వాదనలు వినిపించారు. దశాబ్దాల తరబడి జైళ్లలో నిర్భంధించి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయి. నిషేదాల మధ్యనే భారత కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు, వ్యాప్తికి అడుగులు పడ్డాయి. సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి పార్టీగా సీపీఐ చరిత్రకెక్కింది. రైతులెదుర్కొంటున్న అనేక సమస్యలపై 1936లో ఏఐకేఎస్(రైతు సంఘం), తరువాత వ్యవసాయ కార్మికులకు బీకేఎంయూ(వ్యవసాయ కార్మిక సంఘం), మహిళలకు ఎన్ఎఫ్ఏడబ్ల్యూ, విద్యార్థులకు 1936లో ఏఐఎస్ఎఫ్, యువకులకు ఏఐవైఎఫ్, కళాకారులకు 1943లో ఇష్టా(ప్రజా నాట్యమండలి) లాంటి అనేక సంఘాల స్థాపనలో, వాటిని స్వతంత్ర సంస్థలుగా నడపడంలో, మొట్టమొదటిసారి సంఘాలను రూపకల్పన చేయడంలో సీపీఐ కీలక పాత్ర వహించింది. ఫలితంగా యువకులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటీషుకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటలు చేశారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణలో  సింగరేణి కార్మికుల కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మెడికల్, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ తదితర వర్గాలకు మొట్టమొదటి సంఘాలను ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఆయా వర్గాలు అనేక హక్కులను సాధించుకుంటున్నారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి, రాచరికాన్ని బద్దలుగొట్టి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్​లో విలీనం చేసింది. ఈ పోరాటంలో 4 వేల మంది అమరులైనప్పటికీ, 2,500 గ్రామాలను విముక్తి చేసి10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిన ఘన చరిత్ర ఎర్రజెండాదే. 

ఓట్లు, సీట్లు ప్రామాణికం కావు..

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భూసంస్కరణలను దేశం ఎజెండాగా ముందుకు తెచ్చింది. భూ పరిమితి చట్టం, రాజాభరణాల రద్దు చట్టం, బ్యాంకుల జాతీయీకరణ, ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక చట్టాల వెనుక కమ్యూనిస్టుల పోరాటాల ఉన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్ లో అనేక కుంభకోణాలను వెలికితీయడంలో ప్రధాన భూమిక పోషించింది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం లాంటి అనేక స్కామ్​లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటిని వెలికితీయడంలో అలుపెరగని పోరాటం చేసింది. విదేశీ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని వెనక్కి రప్పించాలని పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పటికీ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ముందుగా పోరాడేది కమ్యూనిస్టు పార్టీ. ప్రజలను చైతన్యవంతులను చేయడం, కార్మికుల హక్కులను కాపాడటంలో కమ్యూనిస్టుపార్టీ ఆనాటి నుంచి నేటి వరకు పనిచేస్తున్నది. డబ్బుతో జరుగుతున్న ఈ కార్పొరేట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి ఓట్లు, సీట్లు రాకపోవచ్చు. ఎన్నికల్లో బలం తగ్గవచ్చు, కాని దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల మద్దతు, ప్రజల అండదండలు ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కమ్యూనిస్టుపార్టీ పుట్టిన తర్వాత అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు పుట్టి, కాలగర్భంలో కలిసిపోయాయి. కమ్యూనిస్టుపార్టీకి మరణం లేదు. శ్రామికులు, పేదవర్గాలు, దేశంలో సమస్యలు ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ మనుగడ ఉంటుంది. ఆనాడు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు ప్రాంతం(ఆంధ్రరాష్ట్రం), హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగా ఉండేది. ఆ ప్రాంతాల్లో మొదటి ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే కమ్యూనిస్టులకే మెజారిటీ సీట్లు వచ్చాయి. అప్పటి పరిస్థితులు నేడు ఉంటే కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారు. ధనస్వామ్యంగా మారిన ప్రస్తుత ఎన్నికల విధానాన్ని మార్చి దామాషా విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే దేశంలోనున్న జాతీయ పార్టీలు రెండు, మూడు ఉంటే వాటిలో కమ్యూనిస్టుపార్టీ జాతీయ పార్టీగా ఉన్నది. సరైన పద్ధతుల్లో కమ్యూనిజాన్ని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా వర్తింపచేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీలన్నీ పునరేకీకరణ చెందాల్సిన అవసరం ఉన్నది. పెట్టుబడిదారి సిద్ధాంతాన్ని ఎదుర్కొనే కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిజానికి మంచి రోజులు అత్యంత సమీపంలో ఉంటాయని ఆశిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుదాం. భారతదేశ సార్వభౌమత్వాన్ని, లౌకిక, ప్రజాస్వామ్య పునాదులను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు పునరంకితం అవుదాం.

–కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ