బీజేపీని ఓడించేందుకే ఆయనకు సపోర్టు

యాదాద్రి : మునుగోడులో బీజేపీని ఓడించడం కోసమే కమ్యూనిస్టులను కేసీఆర్ ​మద్దతు కోరారని, ఇది అవకాశవాదం కానే కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి నుంచి సీపీఎం చేపట్టిన 'మూసీ జల కాలుష్యం నుంచి విముక్తి-–గోదావరి - కృష్ణా జలాల సాధన' కోసం సీపీఎం చేపట్టిన పోరుయాత్రను తమ్మినేని ప్రారంభించారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

బీజేపీని ఓడించాలనుకునే వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో  బీజేపీని ఓడించడానికి కలిసి పోరాటం చేద్దామని కేసీఆర్​ చెప్పడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్​శక్తి సరిపోవడం లేదన్నారు. కాగా ఖమ్మంలో జరిగిన తమ బంధువు కృష్ణయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తమ్మినేని పేర్కొన్నారు. తనపై కృష్ణయ్య భార్య చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.