ఖమ్మం టౌన్,వెలుగు : ప్రజలకు రోగాలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో 287 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
కూసుమంచి, రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లందు ఏజెన్సీలో వైరల్ జ్వరాలతో వందలాది మంది మంచం ప్రజలు ఎక్కారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు,గుర్రం అచ్చయ్య, సి.వై. పుల్లయ్య జి.రామయ్య, మలీదు నాగేశ్వరరావు, తిమ్మిడి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.