రాజ్యాంగ పరిరక్షణ కోసమే సీపీఐ పోరాటం : కూనంనేని సాంబశివరావు

రాజ్యాంగ పరిరక్షణ కోసమే సీపీఐ పోరాటం : కూనంనేని సాంబశివరావు

ఇయ్యాల రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమాన్ని తాము బాయ్ కాట్ చేస్తున్నట్టు సీపీఐ ప్రకటించింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మాక్దుం భవన్ సీపీఐ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామంటూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని ఈ సందర్భంగా కూనంనేని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి గద్దెనెక్కిన పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలిగించాలనే కుట్ర చేస్తున్నారని చెప్పారు. 

రాజ్యాంగ పరిరక్షణ కోసం సీపీఐ పోరాటం చేస్తోందని కూనంనేని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే తమపై పోలీసులు అక్రమ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. భూ సమస్యపై అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపితే ఐపీసీ 123B సెక్షన్ తనపై పెట్టారని వాపోయారు. తాము ఆయుధాలతో ఎవరిపైనా దాడి చేయడానికి అక్కడికి వెళ్ళలేదని, పేద కేవలం ప్రజల భూపోరాటానికి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా సీపీఐ ప్రజల సమస్యల పట్ల పోరాటాలు కొనసాగిస్తోందని హామీ ఇచ్చారు. బీజేపీపై పోరాడేందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని కూనంనేని ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచితే... ఆ పాపంలో సీపీఐకి భాగం ఉందని వ్యాఖ్యానించడం సరైంది కాదని చెప్పారు. తాము బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికి తనపై రెండు కేసులు నమోదైన విషయం రేవంత్ రెడ్డి గ్రహించాలని, తన వ్యాఖ్యలను రేవంత్ వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న కూనంనేని.. గతంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తామే పోరాటం చేశామని చెప్పారు.