హైదరాబాద్/ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను సీపీఎం రిలీజ్ చేసింది. హుజూర్ నగర్నియోజకవర్గంలో మల్లు లక్ష్మి, నల్గొండ సెగ్మెంట్లో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్లను ఖరారు చేసినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మల్లు లక్ష్మి ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నల్గొండ సీపీఎం జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. కోదాడ సెగ్మెంట్అభ్యర్థిని మంగళవారం ప్రకటిస్తామని తమ్మినేని చెప్పారు.
మరో రెండు స్థానాల్లో పోటీపై..
ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మునుగోడు, ఇల్లందు స్థానాల్లోనూ పోటీ చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. మునుగోడులో సీపీఐ పోటీ చేస్తే మద్దతు ఇస్తామన్నారు. కాంగ్రెస్ తో పొత్తులకు సంబంధించి సీపీఎం చాలా క్లారిటీతో ఉందన్నారు. మిర్యాలగూడ, వైరా సీట్ ఇస్తేనే పొత్తు ఉంటుందని మరోసారి తేల్చి చెప్పారు. అభ్యర్థులను ప్రకటించవద్దని కాంగ్రెస్ నేత జానా రెడ్డి తనతో ఫోన్ లో మాట్లాడారని, అభ్యర్థుల ప్రకటన తర్వాత భట్టి విక్రమార్క ఫోన్ చేశారని వివరించారు.