
సంగారెడ్డి టౌన్, వెలుగు: పేదల భూములు కబ్జా చేసిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. గురువారం తమ స్థలాల వద్దకు వెళ్లిన పేదలను, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర నాగంపల్లి, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన 700 మంది పేదలకు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున 2007లో ప్రభుత్వం పట్టాలిచ్చిందని కానీ ఆ భూమి దగ్గరకు వెళ్లకుండా ఫిలిం సిటీ సెక్యూరిటీని పెట్టి అడ్డుకుంటుందన్నారు.
గతంలో స్థలాల్లోకి వెళ్లిన 75 మంది పేదలపై అక్రమ కేసులు పెట్టి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పిందన్నారు . ప్రభుత్వాలు సైతం రామోజీ సంస్థకే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.