నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేలా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేలా ఎలాంటి పథకం లేదన్నారు. వేతన జీవులను సంతృప్తి పరుస్తామని చెప్పి అరకొర ప్రయోజనం కల్పించి ఊరట కల్పించారన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టలేకపోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారన్నారు. ఆర్ శ్రీనివాసులు, రామయ్య, అశోక్, వెంకటేశ్, మధు పాల్గొన్నారు.
కల్వకుర్తి: పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భూషమోని ఆంజనేయులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. ఏపీ మల్లయ్య, పులిజాల పరశురాములు, బాల్ రెడ్డి, కిశోర్, కురుమయ్య పాల్గొన్నారు.