- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రజలపై మోపే భారాలపై చెప్పే దమ్ము ధైర్యం ఉందా? అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీని ఒంటరి చేసి, బలపడకుండా నిలువరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో బీవీ రాఘవులు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా.. ఇంకా సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలే అమలవుతున్నాయని చెప్పారు. ఎన్‌డీఏకు మద్దతిస్తున్న టీడీపీ, జేడీయూ నాయకులు కూడా వాటిని వ్యతిరేకించరని, మద్దతిస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని, అయినా మోదీ సర్కారు మూడోసారి అధికారంలోకి రావడంతో దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. దేశానికి మతోన్మాదం పనికిరాదని, లౌకికవాదం కావాలని, సనాతన ధర్మం సృష్టించే మనువాదం ఉండొద్దని, సమానత్వం కావాలని ఆయన వివరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.
ఆర్థిక పరిస్థితి, నిధుల కొరత పేరుతో వాటి అమలును ఎగ్గొట్టే ప్రయత్నం చేయొద్దని సూచించారు. రైతు భరోసా, రుణ మాఫీ, పోడు భూములకు పట్టాలు, వ్యవసాయ కార్మికులకు సహాయం, ఇండ్లు, ఇండ్ల పట్టాలు, కార్మికులకు కనీస వేతనాల అమలు తదితర ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎంను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, ఎస్.వీరయ్య, చుక్క రాములు, జాన్ వెస్లీ, మల్లు తదితరులు ఉన్నారు.