- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు
సంగారెడ్డి, వెలుగు: పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు ఏ పార్టీపై గెలుస్తున్నారో ఏ పార్టీలో చేరిపోతున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారని వారిపైన చర్య తీసుకునే విషయంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారన్నారు.
హైకోర్టు జోక్యం చేసుకొని స్పీకర్ ను చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. సుప్రీంకోర్టు సైతం అదే విషయాన్ని ఇటీవల నొక్కి చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. రైల్వేలు ఇతర ప్రాజెక్టులో కేటాయింపులు లేకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
బీజేపీకి రాజకీయ స్వార్థం తప్ప తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఇష్టం లేదన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్యా, జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్, నరసింహులు పాల్గొన్నారు.