నకిరేకల్, వెలుగు : జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కందాల ప్రమీల, రైతులతో కలిసి మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి, బోర్లు బావులు, చెరువులు
కుంటలు ఎండిపోయాయన్నారు. మంగళపల్లి గ్రామంలో 2 వేల ఎకరాల్లో వరి వేయగా.. ఇప్పటికే 1500 ఎకరాల పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో రైతులకు మరింత నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం, హశం రాచకొండ వెంకట్ గౌడ్, వెంకటయ్య, అంజయ్య, ప్రకాశ్ రావు, లక్ష్మణరావు , ఎల్లయ్య, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.