బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణపై మండిపడ్డ సీపీఐ

  • బెల్లంపల్లిలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం 

బెల్లంపల్లి, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టేకులబస్తీలోని సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ మెయిన్ బజార్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పైల ఆశయ్య మాట్లాడారు.

బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. బెల్లంపల్లి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోమాస ప్రకాశ్, కె.అశోక్, సీపీఎం టౌన్ సెక్రటరీ అబ్బోజు రమణ, నాయకులు రంజిత్ కుమార్, శ్రీకాంత్, దేవదాస్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బొగ్గు బ్లాక్​ల వేలాన్ని ఆపాలి

నస్పూర్, వెలుగు: బొగ్గు బ్లాక్ ల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు డిమాండ్​ చేశారు. శనివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో విలేకరులతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం వంతుపాడుతోందని మండిపడ్డారు. లాభాల్లో నడుస్తూ 130 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థను కాదని అదానీ, అంబానీలకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.

వేలాన్ని ఆపేందుకు వచ్చే నెల 3న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు పాల్గొని సలహాలు, సూచనలు చేయాలన్నారు. హెచ్ఎమ్ఎస్ నేతలు రియాజ్ ఆహ్మద్, కొమురయ్య, అనిల్ రెడ్డి, ఐఎఫ్​టీయూ నేతలు చాంద్ పాషా, బ్రహ్మానందం, ఏఐఎఫ్​టీయూ నేతలు పాల్గొన్నారు.