సాగర్ జలాలను విడుదల చేయాలి : సీపీఎం నాయకులు

సాగర్ జలాలను విడుదల చేయాలి : సీపీఎం నాయకులు
  • కట్లేరు ప్రాజెక్టు ఆయకట్టులో ఎండుతున్న మొక్కజొన్న, వరి పంటలు 

ఎర్రుపాలెం,వెలుగు: సాగర్ జలాలను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మామునూరు గ్రామంలో ఎండుతున్న పంటలను బుధవారం రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్లేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద సుమారు 6 వేల ఎకరాల పొలాలు రైతులు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, కానీ ప్రాజెక్టులో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. 

రైతులు నష్టపోకముందే లంకాసాగర్ ద్వారా కట్లేరుకు నీళ్లు వదిలి కాపాడాలని కోరారు. నాగార్జునసాగర్ జలాలను విడుదల చేసి తెల్లపాలెం, రేమిడిచర్ల జమలాపురం, ఎర్రుపాలెం గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాల్లో పంటను కాపాడాలని రైతులు డిమాండ్​ చేశారు.