- వరంగల్ జిల్లా జక్కలొద్దిలో పోలీసులు, ఆఫీసర్ల ప్రతాపం
- మడికొండ సిటీ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్‌కు 800 మంది తరలింపు
- డబుల్ ఇండ్లు కట్టివ్వాలని సీపీఎం లీడర్ల డిమాండ్
వరంగల్‌సిటీ, వెలుగు : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం జక్కలొద్దిలోని ప్రభుత్వ భూమిలో నెల కింద సీపీఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకోగా బుధవారం తహసీల్దార్, పోలీసులు కలిసి వాటిని తొలగించి కాలవెట్టారు. అక్కడున్న మహిళలను, పిల్లలను లాఠీలతో భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గుడిసెవాసులకు తోపులాట జరిగింది. చివరికి 800 మందిని అదుపులోకి తీసుకుని డీసీఎంలలో మడికొండ పీటీసీ గ్రౌండ్‌కు తరలించారు. అరెస్టులకు నిరసనగా వారి బంధువులు నాయుడు పెట్రోల్ బంక్ దగ్గర రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సీపీఎం లీడర్లు గుడిసెలు తగలబెట్టిన చోటికి వచ్చి ఆందోళన చేశారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ పేదల గుడిసెలను కాలవెట్టి, లాఠీఛార్జి చేసి..పేదోళ్లపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించి గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలిచ్చి డబుల్ బెడ్ రూమ్ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదన్నారు.
దశల వారీగా విడుదల
కాజీపేట : జక్కలొద్దిలో గుడిసెలు వేసుకున్న వారిని కాజీపేట మండలం మడికొండలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్‌కి తరలించారు. సుమారు 8 వందల మంది ఉండగా, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులను కూడా చూడకుండా సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. అందరికీ మధ్యాహ్నం భోజనాలు పెట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో దశల వారీగా వదిలిపెట్టారు.