బీజేపీని ఓడించే శక్తి ఒక్క సీపీఎంకే ఉంది : రాఘవులు

  •     బూర్జువా పార్టీలకు మా పార్టీ ముల్లుకర్ర
  •     సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు

ఖమ్మం టౌన్, వెలుగు :  బూర్జువా పార్టీలకు సీపీఎం ముల్లుకర్ర వంటిదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలను ఓడించి వామపక్షాలను గెలిపించాలని ఆయన కోరారు. ఖమ్మం సిటీలో గురువారం ఖమ్మం, పాలేరు సీపీఎం అభ్యర్థుల నామినేషన్‌  సందర్భంగా సీపీఎం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాఘవులు  మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించాలని చెప్తూనే, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా పార్టీ కాంగ్రెస్‌కు ఓట్లేయాలనడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 

రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తున్నదన్నారు. ఒక్క కమ్యూనిస్టు ఉన్నా ఆ శాసనసభ రూపు రేఖలే మారిపోతాయన్నారు. ప్రజలు చారిత్రక నిర్ణయం తీసుకుని సీపీఐఎం అభ్యర్థులను బలపరచాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న ప్రతిఒక్కర్నీ ఆహ్వానించేలా తమ పార్టీ విధానాన్ని రూపొందించుకున్నామన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసింది సీపీఎం మాత్రమే అన్నారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌  స్కాంలో ఇరుక్కుని ఉందని, బీజేపీకి భయపడి కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్‌ఎస్‌  ముందుకు రాలేదన్నారు. 

కాంగ్రెస్‌  కన్నా బీజేపీ ప్రమాదకారి కాబట్టి, కాంగ్రెస్  ఉన్న ఇండియా కూటమిలో చేరామని తెలిపారు. పార్టీలు మరేవారు రాజకీయ దళారీలు తప్ప నాయకులు కాదన్నారు. బీజేపీని ఓడించే శక్తి ఒక్క సీపీఎంకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎం జాతీయ నాయకుడు బి.వెంకట్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుదర్శన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

రాఘవులు రాజకీయ విచక్షణ కోల్పోయారు: రంగారావు

కాంగ్రెస్  పార్టీకి ఓటు వేయాలన్న సీపీఐఎంఎల్ ప్రజాపంథా పార్టీకి సిగ్గులేదని విమర్శించిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు రాజకీయ విచక్షణ కోల్పోయారని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఖమ్మం సిటీలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం మీడియా సమావేశంలో రంగారావు మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటీచేసే చోట ఇతర పార్టీలకు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు.

అలాగే ఆ మూడు పార్టీల ఓటమికి ప్రచారం కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సీపీఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పొత్తు కుదరకపోవడం ప్రజలందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలను ఓడించడానికి టీఎస్ డీఎఫ్ ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య,ఆవుల అశోక్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.