
- రేపటి నుంచి మధురైలో సీపీఎం జాతీయ మహాసభలు
- హాజరుకానున్న తమ్మినేని, జాన్ వెస్లీ సహా 34 మంది ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు సీపీఎం పార్టీ అఖిల భారత 24వ మహాసభలు తమిళనాడులోని మధురై నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలకు అన్ని ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 819 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరుకానున్నారు. ఈ నెల 3న ‘ఫెడరలిజం ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా’ అనే సెమినార్ నిర్వహించనున్నారు. 6వ తేదీన రెడ్ ఫ్లాగ్ ప్రాసెషన్ నిర్వ హిస్తారు. అదే రోజు కొత్త జాతీయ కమిటీని ఎన్నుకుంటారు. కాగా, తెలంగాణ నుంచి సీపీఎం జాతీయ కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, చెరుకుపల్లి సీతారాములు, జి నాగయ్య, సెంట్రల్ కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎస్ వీరయ్యతో సహా 34 మంది ప్రతినిధులు మహాసభలకు వెళ్లనున్నారు.
సీపీఎంలో కీలకమైన పొలిట్ బ్యూరో కమిటీలో 17 మంది ఉండగా.. 75 ఏండ్ల ఏజ్ లిమిట్ రీత్యా ఏడుగురు సభ్యులు రిలీవ్ కానున్నారు. దీంతో సీనియర్లంతా ఈ బాధ్యతల నుంచి తప్పుకోనుండడంతో.. కొత్త వారికి అవకాశం రానుంది. కాగా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల మృతిచెందారు. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు సహా కేరళ నుంచి ఎంఏ బేబీ, విజయరాఘవన్, మహారాష్ట్ర నుంచి అశోక్ ధావలే పోటీ పడుతున్నారు.
రాఘవులు ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ టైంలో పేదలకు ఇండ్ల స్థలాలు, భూ సమస్యలపై పోరాటాలు చేశారు. సీపీఎం అఖిల భారత ప్రధాన కార్య దర్శి సీతారాం ఏచూరి మరణించడంతో మహా సభ పూర్తయ్యే వరకు సీపీఎం కేంద్ర కమిటీ సమన్వయకర్తగా సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ను కేంద్ర కమిటీ ఎన్నుకుంది. ఈ సారి ప్రధాన కార్యదర్శి కాకుండా సమన్వయకర్త మహాసభలో నివేదికను ప్రవేశపెట్టనున్నారు.