- అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస
- లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్‌తో హాస్పిటల్లో చేరిక
- పరిస్థితి విషమించడంతో మృతి
- డెడ్‌బాడీని ఎయిమ్స్‌కు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులు
- స్టూడెంట్ నేత నుంచి రాజ్యసభ సభ్యుడిగా
- ఐదు దశాబ్దాల పాటు ప్రజా సేవ
- సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
న్యూఢిల్లీ:కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం జనరల్ సెక్రటరీసీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3.03 గంటలకు తుదిశ్వాస విడిచారు. సీతారాం ఏచూరి మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎయిమ్స్ డాక్టర్లు ధృవీకరించారు. ఆగస్టు 19న అస్వస్థతకు గురైన ఏచూరిని.. కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఐసీయూకు తరలించారు. ట్రీట్మెంట్కు బాడీ సహకరించకపోవడంతో చివరికి తుది శ్వాస విడిచారు.ఆయన కుటుంబ సభ్యులు డెడ్‌బాడీని టీచింగ్, రీసెర్చ్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్‌కు డొనేట్ చేసినట్టు డాక్టర్లు ప్రకటించారు. రెండు రోజుల పాటు డెడ్‌బాడీ ఎయిమ్స్‌లోనే ఉంటుంది. తర్వాత ఆయన అభిమానులు, నేతలు నివాళులర్పించేందుకు వీలుగా సీపీఎం హెడ్‌క్వార్టర్ ఏకేజీ భవన్‌కు తరలిస్తారు. ఆ తర్వాత డెడ్‌బాడీని మళ్లీ ఎయిమ్స్‌కు తీసుకొస్తారని డాక్టర్లు ప్రకటించారు.
హైదరాబాద్‌లోనే ప్రైమరీ ఎడ్యుకేషన్
1952, ఆగస్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి.. బాల్యం మొత్తం హైదరాబాద్‌లోనే గడిపారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్‌గా, తల్లి కల్పకం ఏచూరి గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా పని చేశారు. హైద రాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో సీతారాం ఏచూరి ప్రాథమిక విద్యనభ్యసించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ టైమ్‌లో ఢిల్లీకి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు. 12వ తరగతి వరకు అక్కడే చదివారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అక్కడే పీహెచ్‌డీలో చేరినా.. ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్ట్ కావడంతో అడ్మిషన్ రద్దయింది. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. తర్వాత, జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో పెండ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. కూతురు అఖిల, కొడుకులు డానిశ్, ఆశీశ్ ఏచూరి ఉన్నారు. కొడుకు ఆశీశ్ ఏచూరి (34).. 2021లో కరోనా బారిన పడి చనిపోయారు. ఉమ్మడి ఏపీ సీఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు. కూతురు అఖిల ఏచూరి.. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం
- ఎస్‌ఎఫ్‌ఐ స్టూడెంట్ లీడర్‌గా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
- అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో ఏచూరి అరెస్ట్ అయ్యారు. తర్వాత బయటికొచ్చాక అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు. దీంతో పీహెచ్డీ కంప్లీట్ చేయలేకపోయారు.
- ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ప్రకాశ్ కారత్ పరిచయం అయ్యారు.
- ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు.
- నాలుగేండ్ల తర్వాత యూనైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో కామన్ మినిమం ప్రోగ్రామ్ డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
- 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ కీలకంగా వ్యవహరించారు.
- 2005లో బెంగాల్ నుంచి ఫస్ట్ టైమ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 వరకు ఎంపీగా సేవలు అందించారు.
- 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.
రచయిత, ఎడిటర్‌గా సేవలు
రెండు దశాబ్దాలకు పైగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, వ్యూహకర్తగా సీతారాం ఏచూరి సేవలందించారు. రచయితగా హిందూస్థాన్ టైమ్స్‌లో ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరిట కాలమ్స్ రాశారు. 20 ఏండ్లు సీపీఎం పార్టీ పత్రిక అయిన ‘పీపుల్స్ డెమోక్రసీ’లో ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మూడు సార్లు ఎడిటర్‌గా సేవలందించారు. ‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్: న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.
ఎంపీగా ఎంతో సేవ చేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చనిపోయిన వార్త తెలుసుకుని చాలా బాధపడ్డాను. స్టూడెంట్ యూని యన్ లీడర్‌గా రాజకీయ జీవితం ప్రారంభిం చిన ఆయన.. జాతీయ రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్లమెంటేరి యన్గానూ విశిష్ట సేవలు అందించారు. ప్రజా సమస్యలపై సీపీఎం తరఫున గళం వినిపించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాను.
మంచి మిత్రుడిని కోల్పోయాను: రాహుల్ గాంధీ
రాజకీయాల్లో నేను ఒక మంచి ఫ్రెండ్‌ను కోల్పోయాను. సీతారాం ఏచూరి మృతి.. దేశ రాజకీయాలకు తీరనిలోటు. ఎన్నో సమస్యలపై ఆయనతో నేను సుదీర్ఘంగా చర్చించే వాడిని. ‘ఐడియా ఆఫ్ ఇండియా’కు ఆయన ఒక రక్షకుడు. మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను.
యూపీఏ1లో కీలకం వ్యవహరించారు: సోనియా గాంధీ
సీతారాం ఏచూరి కన్నుమూయడం బాధాకరం. 2004 నుంచి 2008 వరకు కలిసి పని చేశాం. అప్పు డు మా మధ్య ఏర్పడిన స్నేహం.. ఏచూరి చివరి శ్వాస వరకు కొనసా గింది. రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తి. నిబద్ధతలో ఎన్నడూ రాజీపడలేదు. లౌకిక వాదానికి పవర్ఫుల్ ఛాంపియన్. యూపీఏ1 లో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్న.
దేశ రాజకీయాలకు తీరనిలోటు: ప్రధాని మోదీ
వామపక్ష నాయకుడు సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయా లకు తీరని లోటు.వామపక్ష పార్టీ సీపీఎంకు ఎన్నో సేవలు అందించారు. పార్టీలకు అతీతంగా అందరితో ఎంతో బాగా మాట్లాడేవారు. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం గడిపారు. కీలక హోదాల్లో పని చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను.
ఎయిమ్స్‌కు ఏచూరి డెడ్‌బాడీ
వామపక్ష నేతలు ఎవరు చనిపోయినా.. వారి డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీలకు డొనేట్ చేస్తున్నారు. కొన్నేండ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సీతారాం ఏచూరి డెడ్‌బాడీని ఆయన కుటుం సభ్యులు రీసెర్చ్ కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు డొనేట్ చేశారు. 2024, ఆగస్టులో చనిపోయిన బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) పార్థీవ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ (ఎన్ఆర్ఎస్) హాస్పిటల్‌లోని అనాటమీ డిపార్ట్మెంట్కు అప్పగించారు. బెంగాల్‌కు సీఎంగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం హాస్పిటల్‌కు దానం చేశారు. ఆయన 2010లో తుదిశ్వాస విడిచారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2018లో చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు డెడ్‌బాడీని డొనేట్ చేశారు. అదేవిధంగా, సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తో పాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల డెడ్‌బాడీలను కూడా వాళ్ల కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీలకు అప్పగించారు.