- భవనగిరిలో సీపీఎం ప్రచారానికి జాతీయ, రాష్ట్ర నాయకులు
- అభ్యర్థుల గెలుపోటములపై ఆ పార్టీ ఓట్ల ప్రభావం
యాదాద్రి, వెలుగు : తెలంగాణలో పోటీ చేస్తున్న ఏకైక భువనగిరి లోక్‌సభ స్థానంలో సత్తా చూపించాలని సీపీఎం అడుగులు వేస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తోంది. గెలుపు సంగతేమో కానీ ఓట్లు సాధించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి అభ్యర్థి ఎండీ జహంగీర్ ప్రచారం చేస్తున్నారు. కనీసం లక్ష ఓట్లు సాధించాలని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.
గతమెంతో ఘనం..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు గతంలో బలమైన శక్తిగా ఉండేవారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. పలు పార్టీలతో మార్చి మార్చి పొత్తులు, మారిన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం కారణంగా ఆ పార్టీల బలం తగ్గుతూ వస్తోంది. భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, జనగామ నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు.
ఇప్పుడీ నియోజకవర్గాల్లో ఎక్కడా ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేరు. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీలు ఉంటే.. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదుర్చుకోవడంతో ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం అభ్యర్థులకు 1300 నుంచి 4వేల లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. అయినా ప్రజా సంఘాల్లో కీలకంగా ఉండి ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
ఒంటరిగా ఒక్కచోటే.. అందరూ ఇక్కడికే
కాంగ్రెస్‌తో సీపీఐ మిత్రపక్షంగా ఉండడం వల్ల సీపీఎం ఒంటరి పోరులో ఉంది. తెలంగాణలో 17 స్థానాలు ఉంటే భువనగిరిలో మాత్రమే పోటీకి సిద్ధమై ఆ పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ను అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఒక్క స్థానంలో పోటీ చేస్తుండడం వల్ల ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు లోక్‌సభకు ఇంచార్జీగా ప్రకటించడంతో పాటు అసెంబ్లీలకు ఇంచార్జీలను నియమించింది. వీరందరూ ఇప్పటికే క్షేత్ర స్థాయి ప్రచారంలో ఉన్నారు. కార్మిక, ప్రజా సంఘాలు సైతం రంగంలోకి దిగాయి. ఎన్నికల్లో ప్రచారం కోసం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఇతర లీడర్లు రానున్నారు.
లక్ష ఓట్లే లక్ష్యం..
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 18 లక్షల ఓట్లు ఉన్నాయి. 5 లక్షల ఓట్లకు పైగా సాధించుకున్న అభ్యర్థి గెలుస్తారు. సీపీఎం సభ్యత్వం, ప్రజా సంఘాల సభ్యత్వాల సంఖ్యతో పాటు వారి కుటుంబాల్లోని కొన్ని ఓట్లు పడితే చాలు అభ్యర్థి గెలుపు గెలుపు ఓటములు ప్రభావితం అవుతాయి. కానీ, గెలుపు కోసం పోటీ పడుతున్నామని సీపీఎం ప్రకటిస్తోంది. అది సాధ్యం కాని పక్షంలో గెలుపు ఓటములు నిర్ణయించే శక్తిగా నిలబడాలని భావిస్తోంది. అందుకే 3 లక్షల మంది కార్మిక, ప్రజా సంఘాల సభ్యుల నుంచి కనీసం లక్ష ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సభ్యులను, పాతతరం ఓటర్లను కలుస్తూ మన ఓట్లు మనం వేసుకోవాలని ప్రచారం చేస్తోంది.
మూడు ఎన్నికల్లో
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా రంగంలోకి దిగాయి. మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సీపీఎం లీడర్ నోముల నర్సింహయ్యకు 3,64,215 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రె స్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిచారు. రెండో స్థానంలో సీపీఎం నిలిచింది. 2014 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన చెరుపల్లి సీతారాములుకు 54,035 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ విజయం సాధించారు. 2019లో సీపీఎం మద్దతుతో సీపీఐ అభ్యర్థి గోద శ్రీరాములు పోటీ చేయగా 25 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు.