ఈ–ఫార్ములా కేసును త్వరగా తేల్చండి : బీవీ.రాఘవులు

ఈ–ఫార్ములా కేసును త్వరగా తేల్చండి : బీవీ.రాఘవులు
  • అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిందే
  • ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటోంది

సంగారెడ్డి, వెలుగు : ఈ–ఫార్ములా కేసును పెండింగ్‌‌‌‌లో పెట్టకుండా త్వరగా తేల్చాలని సీపీఎం పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు డిమాండ్‌‌‌‌ చేశారు. అవినీతి జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ‘వామపక్ష ప్రత్యామ్నాయ రాజకీయాలు – నేటి అవసరం’ అనే విషయంపై శుక్రవారం సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్‌‌‌‌లో సెమినార్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ జమిలి ఎన్నికలు అంటోందని విమర్శించారు. 

ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే నినాదాన్ని తీసుకుస్తుందన్నారు. పార్లమెంట్‌‌‌‌లో జమిలి బిల్లు పాస్‌‌‌‌ కాదన్న విషయం తెలిసినా.. ప్రచారం కోసమే బీజేపీ ప్లాన్‌‌‌‌ చేసిందని ఎద్దేవా చేశారు. పంజాబ్‌‌‌‌లో 39 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా.. దలేవాల్‌‌‌‌ అనే రైతు నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నా, కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. 2022లో జరిగిన ఉద్యమం సందర్భంగా కనీస గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

జిమ్మిక్కుల కోసమే సావిత్రీబాయిపూలే జయంతిని ఉమెన్స్‌‌‌‌ టీచర్స్‌‌‌‌ డేగా ప్రకటించారన్నారు. కస్తూర్బా ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కస్తూర్బా ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని, వారిని చర్చలకు పిలవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సమావేశంలో సీపీఎం నాలుగో మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్‌‌‌‌ చుక్క రాములు, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ, అడివయ్య, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశ్‌‌‌‌, మాణిక్యం పాల్గొన్నారు.