మోదీని ఎదుర్కొనే ధైర్యం ఎర్ర జెండాలకే ఉంది సీపీఎం పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌‌‌‌

మోదీని ఎదుర్కొనే ధైర్యం ఎర్ర జెండాలకే ఉంది  సీపీఎం పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌‌‌‌

సంగారెడ్డి, వెలుగు : కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎర్రజెండాలకు మాత్రమే ఉందని సీపీఎం పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌‌‌‌ చెప్పారు. పేదలు, కార్మికుల కోసం ముందుండి నడిచేది సీపీఎం అని అన్నారు. సీపీఎం నాలుగో రాష్ట్ర మహాసభలు శనివారం సంగారెడ్డిలో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 

సాయుధ పోరాటానికి పేరుగాంచిన తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. లౌకికవాదం, రాజ్యాంగం, సామ్యవాదంపై విశ్వాసం లేని వారు దేశాన్ని పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్‌‌‌‌ను అవమానించిన అమిత్‌‌‌‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలన ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌‌‌‌ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో 12 గంటలు పనిచేయాలని ఐటీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. 

కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు రూ. 3 లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం అంగన్‌‌‌‌వాడీ, ఆశావర్కర్‌‌‌‌, మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం జీతాలు పెంచడం లేదన్నారు. పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు ఎర్రజెండాతోనే బాగుపడుతాయన్నారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మతోన్మాదులకు తెలంగాణలో స్థానం లేదన్నారు. 

బీజేపీని అడ్డుకునేందుకు కలిసొచ్చే రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుపోతామని చెప్పారు. స్థానిక ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పథకాల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌‌‌‌.వీరయ్య, సీతారాములు, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, జయరాజు, అడివయ్య, బి.మల్లేశ్‌‌‌‌, రాజయ్య పాల్గొన్నారు.