హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జమిలి ఎన్నికల పేరుతో కుట్రకు తెరలేపిందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలనుద్దేశించి ఆదివారం హైదరాబాద్ ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడారు. దేశంలోని చిన్నా చితక పార్టీలను బెదిరిస్తూ, బుజ్జగిస్తూ బిల్లు ఆమోదం పొందేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. దేశంలోని లౌకిక పార్టీలన్ని ఒక్కతాటిపైకి వచ్చి పార్లమెంట్‌లో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జమిలి బిల్లుకు ఆమోదముద్ర పడితే దేశంలోని ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదకరమని హెచ్చరించారు.
లేబర్ కోడ్ అమలు చేయొద్దు..
బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కండక్ట్ రూల్స్‌లో మార్పులు చేయడాన్ని రాఘవులు తప్పుపట్టారు. ఏప్రిల్ నుంచి 4 లేబర్‌కోడ్‌ల మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా కార్మికులు సమ్మె, చర్చల హక్కులను కోల్పోతారని చెప్పారు. ఇండియా బ్లాక్‌లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ లేబర్‌కోడ్‌ల మార్గదర్శకాలను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.