
- కార్మికుల ప్రయోజనాలను తాకట్టుపెడ్తున్న మోదీ
- సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్
- కేసీఆర్, కేటీఆర్, హరీష్‍రావు కార్మికులను గుర్తించలే
- సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
వరంగల్, వెలుగు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రయోజనాలను తాకట్టుపెడుతుందని..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని గద్దె దించాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్‌లో గురువారం నుంచి మూడు రోజుల పాటు సీఐటీయూ ఆలిండియా వర్కింగ్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీని కోసం బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‍లోని నెరేళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తపన్ సేన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ కార్మికుల హక్కులను తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఫిబ్రవరి 18న దేశవ్యాప్త సమ్మెను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‍ను కార్మికులే ఓడించిన్రు : బీవీ.రాఘవులు
రాష్ట్రంలో బీఆర్‍ఎస్ 10 ఏండ్లు అధికారంలో ఉన్నా.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కార్మికులను గుర్తించలేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. తెలంగాణలో 4 కోట్ల 30 లక్షల మంది ఉంటే.. ఇందులో కోటి 50 లక్షల మంది కార్మికులు ఉన్నారనే విషయాన్ని కేసీఆర్ సర్కార్ గ్రహించలేదన్నారు. అందుకే ఓడించారన్నారు. రాష్ట్రంలో కార్మిక విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్‍రెడ్డికి సలహా ఇచ్చారు. లేదంటే కేసీఆర్ పరిస్థితే కాంగ్రెస్‍కు వస్తుందన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 17 శాతం ఓట్లు, 4 ఎంపీ సీట్లు గెలిచిందని.. ఈసారి అవకాశం ఇవ్వొద్దని కోరారు. సీఐటీయూ ఆలిండియా కార్యదర్శి వీఆర్.సింధు, రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, సీఐటీయూ నేషనల్ట్రెజరర్ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శులు జె.వెంకటేశ్, రాగుల రమేశ్, నేతలు ఎం.చుక్కయ్య, చక్రపాణి, వెంకట్, రామస్వామి పాల్గొన్నారు. సభకు ముందు సిటీలో ర్యాలీ నిర్వహించారు.