ప్రజాస్వామ్య విలువలకు మోదీ సర్కారు పాతర

ప్రజాస్వామ్య విలువలకు మోదీ సర్కారు పాతర
  • హిందుత్వం, కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేందుకే ప్రాధాన్యం
  • సీపీఎం ప్రతినిధుల సభలో ప్రకాశ్  కారత్  ఫైర్

సంగారెడ్డి, వెలుగు: హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్లపైనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ సమన్వయకర్త ప్రకాశ్  కారత్  విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డిలో కొనసాగుతున్న సీపీఎం నాలుగో రాష్ట్ర మహాసభలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను సభ స్మరించుకుంది. ప్రకాశ్  కారత్  మాట్లాడుతూ వామపక్షాల ఐక్యత కోసం కృషి చేయాలన్నారు.  దేశంలో 63 సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ మిత్రుల సహకారంతో నరేంద్ర మోదీ మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అయినా బీజేపీ హిందుత్వ ఎజెండాలో ఎలాంటి మార్పూ లేదన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక, సమాఖ్య విలువలకు మోదీ సర్కారు తిలోదకాలిస్తోందని ఆయన ఫైర్  అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సమాజంలో కమ్యూనిస్టులు తమదైన ముద్ర వేశారని అన్నారు. ప్రశ్న ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందన్నారు. ఎన్ని యిజాలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎప్పటికీ సజీవంగా ఉండే ఏకైక సిద్ధాంతం కమ్యూనిజమే అన్నారు. 

అమరవీరులకు నివాళులు

ప్రతినిధుల సభకు ముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు హేమలత, అరుణ్ కుమార్, పుణ్యవతి, జి.నాగయ్య, చెరిపెల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, టి.సాగర్, డీజీ నర్సింహారావు, జాన్ వెస్లీ, జ్యోతి, చుక్క రాములు తదితరులు అమరవీరులకు నివాళులర్పించారు.