మూసీ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపి ఇండ్లు ఖాళీ చేయించాలి : విజయ రాఘవన్

మూసీ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపి ఇండ్లు ఖాళీ చేయించాలి : విజయ రాఘవన్
  • ప్రభుత్వానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, రాఘవులు వినతి

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాకే ఇండ్లు ఖాళీ చేయించాలని సీపీఎం పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు,  రాష్ట్ర కార్యదర్శ తమ్మినేని వీరభద్రం కోరారు. బుధవారం చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌‌ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను అమలు చేయాలని  డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో 49  కేంద్రాల్లో ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించకుండా.. పేదల ఇండ్లను కూలగొట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో నదికి ఆనుకుని ఉన్న ఇండ్లను ప్రభుత్వం తొలగించడాన్ని సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తున్నదని, రివర్‌‌బెడ్‌‌లో ఇండ్లు నిర్మించినోళ్లకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్​ చేశారు. మొదట నిర్ణయించిన రీజినల్‌‌ రింగ్‌‌రోడ్‌‌ ఆలైన్‌‌మెంట్‌‌ను అమలు చేయాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌‌ ధరకు 3 రెట్లు పెంచి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలన్నారు.