సర్వీస్ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి

సర్వీస్ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి

నార్కట్​పల్లి, వెలుగు : సర్వీస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి చింతపల్లి బయన్న ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం నార్కట్ పల్లి – అద్దంకి హైవేపై రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం ఆందోళనకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్డు పనులు చేపట్టి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. 

సర్వీస్ రోడ్డు 16 ఫీట్లు వేయాల్సి ఉన్నప్పటికీ 8 ఫీట్లు మాత్రమే వేశారని, దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తక్షణమే కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు విస్తీర్ణం పెంచి మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకు పెద్దులు, సీపీఎం నాయకులు, బీఎస్పీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.