డంపింగ్​యార్డ్ ను రద్దు చేయాలి

డంపింగ్​యార్డ్ ను రద్దు చేయాలి
  • నల్లవల్లి, ప్యారానగర్ ప్రజలకు మద్దతుగా సీపీఎం

పటాన్​చెరు (గుమ్మడిదల), వెలుగు: గుమ్మడిదల మండల పరిధిలోని నల్లవల్లి శివారులో గల ప్యారానగర్​లో రాంకీ సంస్థ, జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్న డంపింగ్​యార్డ్​ను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని సీపీఎం నేతలు తెలిపారు. శనివారం నల్లవల్లిలో సీపీఐ (ఎం) నాయకుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.రాజయ్య, అతిమెల మాణిక్  మాట్లాడుతూ.. పంట పొలాల మధ్య చెత్త కుంపటి పెట్టి ఊర్లను వల్లకాడు చేయొద్దన్నారు.

జీహెచ్ఎంసీ, పొల్యూషన్, రెవెన్యూ అధికారులు, రాంకీ సంస్థ కలిసి పల్లెటూర్లను పాడు చేయాలని చూస్తే ఎర్రజెండా చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే పర్యావరణ అనుమతులొచ్చాయంటూ ప్యారానగర్​లో డంపింగ్​యార్డ్​పనుల్ని ప్రారంభించడం అప్రజాస్వామిక చర్య అన్నారు.

ఇప్పటికే జవహార్​నగర్​లో డంపింగ్​యార్డ్​ పెట్టడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం విపరీతంగా పెరిగిందన్నారు. ప్యారానగర్​లో డంపింగ్​యార్డ్​పెట్టడం వల్ల చుట్టూ ఉన్న 13 గ్రామాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కి తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వర్, పటాన్​చెరు ఏరియా సీనియర్​నాయకులు వాజీద్అలీ, మాజీ సర్పంచ్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.