- ఎన్నికల్లో లబ్ధి కోసమే యూసీసీపై చర్చ: బీవీ రాఘవులు
హైదరాబాద్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతున్నదని, పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ఫెయిల్అయిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్‌బీ భవన్‌లో రెండ్రోజులుగా కొనసాగుతున్న సీపీఎం పార్టీ రాష్ట్ర కమి టీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశానికి రాఘవులు చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
కూరగాయలు, పప్పులు, పాలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయని, టమాటా ధర రూ.150కి చేరిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు టమాటా ధరే ఉదాహరణ అని చెప్పారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం యూసీసీ అంశాన్ని లేవదీసిందన్నారు. యూ సీసీపై ఇప్పటి దాకా కేంద్రం ఒక నివేదికను రూపొందించి చర్చకు పెట్టలేదనీ, ప్రజల్లోకి లీకులు వదులుతున్నదని విమర్శించారు.