కరీంనగర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐలమ్మ విగ్రహం నుంచి కలెక్టరెట్ వరకు సీపీఎం ర్యాలీ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్ముతున్నారని ఆరోపించారు.
దేశంలో12 వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్యలకు కారణమయ్యారని వాసుదేవ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మభ్యపెట్టి, ఏ ఒక్కరికీ ఇవ్వలేదని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ధరణి పోర్టల్ సవరించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.