విభజన హామీల ఊసేత్తని మోదీ.. :కూనంనేని సాంబశివరావు

ప్రధాని వరంగల్​టూర్​ నిరాశ మిగిల్చిందని  సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీల ఊసే ఎత్తకపోవడం దారుణమని పేర్కొన్నారు. జులై 9న కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ పార్టీని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ సాధించుకోవడానికి పాదయాత్ర చేస్తామని తెలిపారు.  బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా బండి సంజయ్ ని ఎందుకు తప్పించారో తెలపాలన్నారు.  రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పుంజుకోదని విమర్శించారు. 

మునుగోడులో తమ పార్టీ బీఆర్​ఎస్ కు సపోర్ట్​ చేయకపోతే బీజేపీ గెలిచేదని తెలిపారు. మునుగోడు ఫలితమే కర్ణాటకలో బీజేపీకి ఓటమిని రుచి చూపించిందన్నారు.  సీఎం కేసీఆర్ తో ఇది వరకే చాలా సార్లు చర్చలు జరిపామని.. సయోధ్య కుదిరితే వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని అన్నారు.  వరంగల్​ వచ్చిన ప్రధాని మోదీ తన ఔన్నత్యాన్ని దిగజార్చుకుని మాట్లాడారని కూనం ఆక్షేపించారు. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీజేపీ దక్షిణాదిపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే అని అన్నారు.  బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టి 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.