సత్తుపల్లి, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం జరిగిన మహాసభకి పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతో కలిసి తమ్మినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం పేరున ఏడో గ్యారంటీ ఇచ్చిన సీఎం నిర్బంధాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. లగచర్ల విషయంలో సీపీఐ (ఎం) హెచ్చరిక నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్‌తో సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప.. పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఉన్న రూ. 10 వేలను కూడా ఇవ్వడం మానేసిందన్నారు. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను నియంత్రించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్న విషయం తెలియాదా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలను పిలిచిన సీఎంకు గ్రూప్ 1, మూసీ, హైడ్రా వంటి కీలక అంశాలను ఎలా వదిలేశారన్నారు.
కమ్యూనిస్టులకు బలం.. సీట్లలో కాదు, గుండె ధైర్యంలో ఉందన్నారు. ఎర్రజెండాకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా బస్టాండ్ సెంటర్ సమీపంలోని రావి వీరవెంకయ్య భవనం నుంచి పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబు, నాయకులు బి. వెంకట్, పాలడుగు భాస్కర్, నున్నా నాగేశ్వరరావు, సోమయ్య, బుగ్గవీటి సరళ, భాస్కరరావు, బండి రమేశ్, నాయుడు వెంకటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, ఎం. సుబ్బారావు, యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు.