
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలను నిర్భంధాలతో అణిచివేయాలని చూస్తే మరింత తిరగబడతారని హెచ్చరించారు.
స్థానిక ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా డంపింగ్ యార్డ్ నిర్మించాలని చూడడం సరైనది కాదన్నారు. లక్షలాది టన్నుల చెత్తను పోసేందుకు పంటలు పండే పొలాలను ఎంచుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. నిరాహార దీక్షలో సీపీఎం నేతలు జయరాజ్, మల్లేశం, రాజయ్య , మాణిక్యం, సాయిలు, నర్సింలు, నాగేశ్వర్, ప్రవీణ్ కుమార్, యాదగిరి, కృష్ణ, వీరస్వామి, రమేశ్ గౌడ్, నాగభూషణం, పద్మ పాల్గొన్నారు.