మక్తల్, వెలుగు: ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలో సీపీఎం జిల్లా ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టుల శక్తి మరింత పెరుగుతుందన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగు భూముల కోసం పోరాటాలు చేసిందన్నారు.
నిత్యావసర ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మోడీ పట్టించుకోవడం లేదన్నారు. మోడీ విధానాలతో దేశం నాశనం అవుతోందన్నారు. దేశ సంపదను సంపన్నులకు అమ్మేస్తున్నారని, మతోన్మాద రాజకీయాలతో దేశంలో విద్వేషాలను పెంచుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ఉద్యమిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాగర్, జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, జాన్వెస్లీ, భూపాల్, వెంకట్రాములు, గోపాల్, పుంజనూరు ఆంజనేయులు, బలరామ్, అంజిలయ్య గౌడ్ పాల్గొన్నారు.