
- సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ
సూర్యాపేట, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి ఐక్య కార్యాచరణతో ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేటలో జరిగిన జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని, సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలకు కేంద్రం కోతలు పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి రూపాయి ఆదాయం కేంద్రానికి వెళ్తే.. కనీసం పావలా కూడా తిరిగి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ను పునఃసమీక్షించి తెలంగాణకు నిధులు కేటాయించేలా తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
లేదంటే వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఉద్యమాలకు పిలుపునిచ్చిందన్నారు. మార్చి 8న మనువాదానికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం, మార్చి 23న గ్రామగ్రామాన భగత్ సింగ్, సుఖ్ దేవ్ , రాజ్ గురుల వర్ధంతి ఘనంగా చేస్తామని తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం కలిసి వచ్చే శక్తులతో ఉద్యమాలను బలోపేతం చేస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మి, నెమ్మాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.