ఫార్మాసిటీ రద్దు చేశామని ప్రకటించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ

ఫార్మాసిటీ రద్దు చేశామని ప్రకటించాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫార్మాసిటీ రద్దు చేశామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో సీపీఎం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మాసిటీ ఏర్పాటును ప్రభుత్వం రద్దు చేసినట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. 

ఇక్కడి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ప్రాజెక్టుల కోసం చేపట్టే బలవంతపు భూసేకరణకు తాము వ్యతిరేకమని తెలిపారు. ఎవరైనా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటే వారికి మార్కెట్​విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇక్కడి రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుభీమాలాంటి సంక్షేమ పథకాలను అమలుచేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో రైతుల సమస్యలు పరిష్కరించకుంటే సీపీఎం పోరాటం చేసి వారికి బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు.