తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం: సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్ వెస్లీ

తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం: సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్ వెస్లీ

 

  • ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను వదిలిపెట్టం: జాన్ వెస్లీ
  • బీజేపీతో కలిసి పనిచేసే ఏ పార్టీయైనా, సంఘానికైనా వ్యతిరేకమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీపీఎంను మరింత బలోపేతం చేసి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌‌‌‌‌ వెస్లీ అన్నారు. పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని, నూతన కమిటీని, కార్యదర్శి వర్గాన్ని, కార్యదర్శిని ఎన్నుకున్నామన్నారు. 

బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌‌‌‌‌‌‌‌లోని ఎంబీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎం శ్రామిక వర్గాలు, అణగారిన వర్గాల పార్టీ అని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నదన్నారు. 

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం అందని ద్రాక్షగా మిగిలిందన్నారు. దావోస్ పెట్టుబడులు ప్రకటనలకే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్, బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలకు లబ్ధిచేకూర్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మతం ముసుగులో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్న బీజేపీ మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటుమన్నారు. 

బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరిని బట్టి వారితో కలిసి పనిచేయడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీతో కలిసి పనిచేసే ఏపార్టీయైనా, సంఘానికైనా తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జాన్ వెస్లీని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అభినందించారు. బుధవారం వెస్లీకి ఫోన్ చేసిన మహేశ్ దేశంలో, రాష్ట్రంలో మతతత్వశక్తులనుఓడించేందుకు లౌకిక వాద సిద్ధాంతాలతో కలిసి పనిచేద్దామని కోరారు.