హెచ్‌‌సీయూ భూములను అమ్మొద్దు : జాన్ వెస్లీ

హెచ్‌‌సీయూ భూములను అమ్మొద్దు : జాన్ వెస్లీ
  •   విద్యార్థుల అరెస్ట్ అక్రమం.. వారిని వెంటనే విడుదల చేయాలి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్‌‌ యూనివర్సిటీ (హెచ్‌‌సీయూ)కి చెందిన భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్‌‌ చేశారు. సోమవారం ప్రెస్ క్లబ్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. . ఆ భూములు హెచ్‌‌సీయూవేనని, అప్పట్లో వర్సిటీ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో.. ఇప్పుడు ప్రభుత్వ భూమిగా చెబుతున్నారన్నారు. భూముల అమ్మకాలపై ప్రశ్నించిన 60 మంది స్టూడెంట్స్‌‌ను అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు మాదాపూర్‌‌, రాయదుర్గ్‌‌, గచ్చిబౌలి పోలీస్‌‌ స్టేషన్లల్లో నిర్బంధించారన్నారు. పోలీసుల దాడిలో ఒక విద్యార్థి తల పగిలిందని, పలువురి విద్యార్థినుల దుస్తులు చిరిగిపోయాయన్నారు.

మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని పోలీసులు ఒత్తిడి చేశారని మండిపడ్డారు. స్టూడెంట్లపై అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌‌ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్సిటీకి కేటాయించిన భూములను అమ్మకానికి పెట్టొద్దని, వర్సిటీ అభివృద్ధికే వాటిని వినియోగించాలని కోరారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ హెచ్‌‌సీయూ వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన ధర్నాకు పిలుపునిచ్చారు.